హెచ్1బీ ఉద్యోగుల విషయమై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ ఉద్యోగుల విషయమై కీలక నిర్ణయం తీసుకొన్నారు.

ప్రతిభ ఉన్నవారికే హెచ్1బీ వీసాలిచ్చేలా నోటిఫికేషన్ ఇచ్చిన అమెరికా ప్రభుత్వం.. తాజాగా మంగళవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) తుది వేతన నిబంధనలను విడుదల చేసింది.

హెచ్1బీ వీసా లేదా గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం)పై పనిచేసే ఉద్యోగులకు ఆయా సంస్థలు జీతాలను పెంచేలా ఆ దేశ కార్మిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 14 నుంచి ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం తన అధికారిక రిజిస్టర్ లో ప్రచురించనుంది. అప్పటి నుంచి 60 రోజుల్లోగా దీనిని అమలు చేస్తారు.

ఇంతకుముందు గతేడాది అక్టోబర్ 8న వేతనాలు పెంచే విషయంపై మధ్యంతర తుది నిబంధనలను తీసుకొచ్చారు. అయితే, దీనిపై టెక్నాలజీ, విద్యా రంగం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మూడు జిల్లా కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. కొత్త నిబంధనలను పరిపాలనా విధాన చట్టం ప్రకారం పొందుపరచలేదని, ప్రజాభిప్రాయం తీసుకున్నాకే వాటిని అమలు చేయాలని మూడు కోర్టులూ తీర్పు చెప్పాయి. దీంతో వాటిని కార్మికశాఖ పక్కన పెట్టింది. ఇప్పుడు తాజాగా కొత్తగా తుది నిబంధనలను ఇచ్చింది.