ఘోర రోడ్డు ప్రమాదం..ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు

వాస్తవం ప్రతినిధి: కరీంనగర్ వరంగల్ మధ్య ఉన్న జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వెళ్తున్న ఆర్టిసి బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళుతున్న ప్రయాణికులు గాయపడ్డారు.

రెండు ఆర్టీసీ బస్సులను నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు చెబుతున్నారు. పైగా పొగమంచు కూడా భారీ ఎత్తున ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో 24 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారందరినీ ఆసుపత్రులకు తరలించారు.