వాస్తవం ప్రతినిధి: శబరిమల అయ్యప్పస్వామికి మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. అయ్యప్పస్వామికి ఎంతో ఇష్టమైన బంగారు నగలు తీసుకెళ్లే పవిత్రమైన తిరునాభరణం కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. అయ్యప్పస్వామికి అలంకరించే తిరునాభారణం ఊరేగింపు కార్యక్రమం పందలంలోని వయియాకోయక్కల్ ధర్మస్థ ఆలయం నుంచి ప్రారంభం అయ్యింది. సంక్రాంతి నాటికి అయ్యప్పస్వామి సన్నిధానంకు చేరుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నియమాలను పాటిస్తూ శబరిమలలో మకరవిలక్కు ఉత్సవాలు సాగుతున్నాయి. సంక్రాంతి రోజుకు ఊరేగింపు శబరిమలకు చేరుకుంటుంది.
మకర సంక్రాంతి రోజున జరిగే మకరజ్యోతిని వీక్షించి, తరించేందుకు ఏటా పెద్దసంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటారు. అయితే ఈ ఏడాది కరోనా విజృంభణ దృష్ట్యా.. శబరిమలలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు ఆలయ అధికారులు.
శబరిమలయ వచ్చే భక్తులు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని రావాల్సి ఉంటుంది. ముందులా కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సందర్శకుల సంఖ్యను బాగా తగ్గించడం జరిగింది.