పండుగ రోజు కోడి పందేలు జోరు..732 మంది పందెం రాయుళ్లు అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రలో పండుగ పేరుతో పందెం రాయుళ్లు యథేచ్చగా కోడి పందేలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏపీలోని అనేక జిల్లాల్లో కోడి పందేల బరులు సిద్దమైపోయాయి. మరోపక్క పోలీసులు ఎక్కడ పందేలు నిర్వహించినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా పోలీసులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు ఒక్క కృష్ణాజిల్లాలో 432 కేసులను నమోదు చేశామని, 732 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.

వీరి నుంచి 65 లక్షల 8 వేల రూపాయలను, 2240 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కోడి పందేలు యథేచ్చగా సాగుతున్నాయి. పోలీసులు ఎక్కడి కక్కడ పందెం బరులను ధ్వంసం చేస్తున్నామని చెబుతున్నప్పటికి, కొన్ని ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులే స్వయంగా బరులను ఏర్పాటు చేస్తున్నారు. వీరి జోలికి పోలీసులు కూడా వెళ్లడం లేదని, కేవలం ఏ అండా లేకుండా ఏర్పాటు చేసిన బరులపై మాత్రమే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.