తెలుగు సంస్కృతి సంప్రదాయాలు.. భోగి పండుగ విశిష్టత !

ఆప్తులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ చాలా ప్రత్యేకమైన పండుగలు.
పాతకాలంలో సంక్రాతి పండుగ అంటే .. నెలరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు రాకతో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. మూడు రోజులపాటు జరుపుకొనే ఈ పండుగను కొన్ని రోజులు నాలుగోరోజు ముక్కనుమగా కూడా జరుపుకుంటారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెలుగు సంస్కృతికి అద్దంపడతాయి ఈ సంబరాలు.

మూడు పండుగల్లో మొదటి రోజును భోగి పండుగగా జరుపుకుంటాము. ఏడాది అంతా ఎదురుచూసే పండగ ఎందుకంటే అక్కలు బావలు, అన్నలు వదినలు, మావలు అత్తయ్యలు, పెద్దమ్మ, చిన్నమ్మ, పిన్నిలు, పెదనాన్న, చిన్నాన్న, బాబాయిలు, అన్నలు  తమ్ముళ్ళు, కొడుకులు, కోడళ్ళు ఇంకా వరస కలుపుకొంటే అందరూ చుట్టాలే. ఒకటే సందడి. అమెరికా ప్రపంచంలో ఏం మనం కోల్పోతున్నామో ఒక్కసారిగా అవలోకం చేసుకొంటే తెలుస్తుంది.

భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. అంతేకాదు ఈ భోగి పండుగ వస్తూవస్తూ సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని వెంటతెస్తుంది…

భోగ భాగ్యాలు ప్రసాదించే పండుగతోనే సంబరాలు మొదలవుతాయి. భోగి రోజు సంబరమంతా పిల్లలదే. భోగిమంటలు, భోగిపళ్లు, పొంగలి తయారీ, ఇలా తెల్లవారకముందు నుంచి మొదలయ్యే సంబరాలు సాయంత్రం వరకూ కొనసాగుతాయి. మహర్నవమి దసరా భోగి. అంటే పండక్కి సిద్ధమయ్యే కాలన్నే భోగిగా పిలుస్తారు. అయితే సంక్రాంతికి సిద్ధం చేసే భోగి పండుగ కావడంతో ఈమూడురోజుల్లో మొదటి రోజుకి మరింత విశిష్టత ఏర్పడింది. భోగిపండుగ విష్ణమూర్తికి చెప్పలేనంత ఇష్టం. నెలరోజులపాటు గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడై దివినుంచి భువికి దిగివచ్చాడాయన. అందుకే భోగి రోజు ఉదయాన్నే చక్కగా అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు.

భోగిరోజు ప్రధానమైనవి భోగిమంటలు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు వేకువ జామునే పాత చెక్కలతో మంటలు వేసి.. అందులో ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తారు.ఇంటిలోని పాత బట్టలు, పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేస్తారు. మనలోని చెడును తగలబెట్టి, మంచిని పెంచుకోవడమే ఈ భోగిమంటల అంతరార్థం. ఈ సంబరాన్ని చిన్న పిల్లలు ఇష్టంతో జరుపుకుంటారు. ఇక కొత్త బట్టలు, భోగి స్పెషల్ పిండి వంటలు ప్రతి పండుగకు చేసుకొనేవే.. అయితే ఈ భోగి రోజున చిన్నపిల్లలకు చేసే వేడుక మరీ స్పెషల్. చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి, కూర్చోబెట్టి భోగిపళ్లు పోస్తారు. ఇలా చేయడం వెనుక ఓ కారణం ఉందని పెద్దలు చెబుతారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు, రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం.

అంతేకాదు మన కంటికి కనిపించని బ్రహ్మ రంధ్రం మన తల పై భాగంలో ఉంటుందని.. ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మ రంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని పూర్వీకుల నమ్మకం. ఎందుకంటే రేగు పండ్లు సూర్య కిరణాలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, శరీరం పై, ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందుకనే చిన్న పిల్లలకు రేగుపళ్లు, పూలు, చిల్లరపైసలు నెత్తిన పోసి ఆశీర్వదిస్తారు.

కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.
మన ఆచార, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా పాటించాలని కోరుకుంటూ అందరికీ భోగభాగ్యాల భోగి శుభాకాంక్షలు.

ఇట్లు,
కరోతు సురేష్