కేసీఆర్ ను రాజకీయ సమాధి చేయడమే నా లక్ష్యం: బండి సంజయ్

వాస్తవం ప్రతినిధి: జనగామ మునిసిపల్ కార్యాలయం ముందు ధ‌ర్నాకు దిగిన బీజేపీ కార్యకర్తలపై సీఐ మల్లేశ్ లాఠీఛార్జ్ చేసారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.
పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు నిరసనకు పిలుపునివ్వడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనగామకు వెళ్లారు. జనగామ చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి… పోలీసుల లాఠీఛార్జిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలు పవన్ శర్మ తదితరులను ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పోలీసులపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని మండిపడ్డారు. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఉంచి, స్వామి వివేకానంద ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని… లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి డైరక్షన్ లో పోలీసులు రెచ్చిపోతున్నారని, మా కార్యకర్తలను రక్తం కారేలా కొడుతున్నారని అన్నారు. ఆరేళ్లుగా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని ఆయన అన్నారు. స్వామి వివేకానంద జయంతిని జరిపితే సీఎంకు వచ్చిన ఇబ్బంది ఏంటీ..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మానవ మృగం అంటూ ఆరోపించిన అయన బీజేపీని అణచివేయాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. కేసీఆర్ ను రాజకీయ సమాధి చేయడమే నాలక్ష్యం అని ఆయన ప్రకటించారు. జనగామ మున్సిపల్ కమిషనర్, సీఐ, ఎస్సై వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీకొడుకు కొడితే బాధేంటో నీకు తెలుస్తుంది కేసీఆర్ అంటూ ఆయన కామెంట్ చేశారు.