అదే నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి : చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరన్న ఆయన రైతు కూలీలు చితికిపోయారని అన్నారు. అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారన్న బాబు పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానని అడ్డంగా దొరికిన దొంగ, ప్రజావేదిక కూల్చి ఇంతవరకు శిథిలాలు తీయకుండా పైశాచిక ఆనందం పొందే శాడిస్టు జగన్ అని అన్నారు. రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందన్న ఆయన పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఫించన్లు పెంచుకుంటూ పోతానని మోసాగిస్తున్నారని, అలానే అప్పుల కోసమే మీటర్లు పెడుతున్నారని అన్నారు. పట్టణాల్లో అన్నింటి పైనా పన్నులేనన్న ఆయన పెంపుడు జంతువుల పైనా పన్నులు విధిస్తున్నారని అన్నారు. గాలి రెడ్డి కాబట్టి రేపోమాపో గాలిపైనా పన్ను వేస్తారని ఆయన అన్నారు. “నేనేం తప్పు చేసానో నాకు తెలీదు, ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశా, అదే నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి” అని ఆయన కోరారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారని బాబు అన్నారు.

టీడీపీ జోనల్ ఇన్ఛార్జిలు, పార్లమెంటు అధ్యక్షులు, సమన్వయకర్తలు, అసెంబ్లీ ఇన్ఛారీలతో చంద్రబాబు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో తోటలను రైతులు దున్నేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. టన్ను అరటి ధర రూ. 8 వేల నుంచి రూ. 2 వేలకు పడిపోయిందని చెప్పారు. పంటలకు మద్దతు ధర లేక రైతు అల్లాడిపోతున్నాడని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపడ్డారు. రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.