ఘోర రోడ్డు ప్రమాదం…కేంద్రమంత్రి భార్య, పీఏ మృతి

వాస్తవం ప్రతినిధి: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . రక్షణ, ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలవగా, భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్‌ మరణించినట్లు అధికారులు తెలిపారు. శ్రీపాద్‌ నాయక్‌ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా సమీపంలో బోల్తాపడింది. ఎల్లాపూర్‌ నుంచి గోకర్ణ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం కేంద్రమంత్రిని గోవాలోని బంబోలి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ను ప్రధాని మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. అవసరమైతే విమానంలో ఆయనను ఢిల్లీ తరలించాలని సూచించారు. కాగా, సావంత్‌ ఆస్పత్రికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు.