రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల్లో గోల్డెన్ జూబ్లీ కూడా పూర్తి చేసుకుంటారు – వర్ల రామయ్య

వాస్తవం ప్రతినిధి: స్వయంకృషి తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాజకీయాల్లో ఎదిగిన నాయకుడు రాజేంద్ర ప్రసాద్ అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.

ఉయ్యూరు మున్సిపాల్టీ 5 వార్డు లో రాజేంద్ర ప్రసాద్ గారు రాజకీయంగా 25 సంవత్సరాలు (సిల్వర్ జూబ్లీ) సందర్బంగా 5 వార్డ్ ప్రజలకు చిరు కానుక ఇచ్చి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి కార్యక్రమాన్ని వర్ల రామయ్య ప్రారంభించారు.

ఈ సందర్బంగా వర్ల రామయ్య మాట్లాడుతూ నేను ఉయ్యూరు సి. ఐ గా పనిచేస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు సారా వ్యతిరేక ఉద్యమం చేస్తుంటే నేను ఆ ఉద్యమం చూసి ఇతను ఏదొక రోజు మంచి నాయకుడిగా ఎదుగుతాడని అప్పుడే అనుకున్నానని, నేను అనుకున్నదానికంటే ఎక్కువగానే ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేసి సొంతంగా ఆయన స్వయం కృషి తోనే ఈ స్థాయికి ఎదిగి, ఈరోజు రాజకీయ సిల్వర్ జూబ్లీ వేడుకలకు నన్నే ముఖ్య అతిధిగా పిలవడం చాలా సంతోషకరంగా ఉందని, రాజేంద్ర ప్రసాద్ సిల్వర్ జూబ్లీ కాదు రాజకీయంగా గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకుంటారని, పార్టీలో ఈ లాంటి క్రమశిక్షణ కలిగిన నాయకుడు రాజకీయంగా ఉచ్చస్థితిలో ఉంటారని వర్ల రామయ్య గారు అన్నారు.

రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ 5 వార్డులో నేను సర్పంచ్ గా గెలవక ముందు రోడ్లన్నీ మట్టి, బురదతో నడవడానికి వీలు లేకుండా ఉండేవని, త్రాగు నీరు మరియు డ్రైనేజి సమస్యలు దయనియంగా ఉండేవని, నేను సర్పంచ్ గా గెలిచిన తరువాత రోడ్లన్నీ రబ్బీస్ తోలించి, తరువాత తారు రోడ్లు వేసి, మంచినీటి పైపు లైన్లు వేసి, డ్రైనేజీలు కట్టించి అనేక అభివృద్ధి పనులు చేసానని, ఈ పెద్దవాళ్లకు ఆ పనులన్నీ తెలుసనీ, ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులకు, యువతకు ఇవన్నీ తెలియవని, అలాగే నేను పదవిలో ఉన్నా లేకపోయినా మీకు సేవ చేస్తూనే ఉంటానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమం లో బీసీ నాయకులు వీరంకి గురుమూర్తి గారు, తోట్ల వల్లూరు మండల తెదేపా అధ్యక్షులు వీరపనేని శివరాం, 5 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి పరిమి సంతోషిని, పరిమి భాస్కర్, చేదుర్తి పాటి ప్రవీణ్ మరియు తెదేపా నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు .