టీమిండియా క్రికెట‌ర్ల‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

వాస్తవం ప్రతినిధి: టీమిండియా క్రికెట‌ర్ల‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సిడ్నీ టెస్టులో భార‌త క్రికెట‌ర్లు ప్ర‌ద‌ర్శించిన అసాధార‌ణ ప్ర‌తిభ‌ను మెచ్చుకున్నారు. అయిద‌వ రోజున భార‌త్ ప్ర‌ద‌ర్శించిన పోరాటం, ప‌ట్టుద‌ల అద్భుత‌మ‌ని పాంటింగ్ అన్నారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని ట్వీట్ చేశారు. రిష‌బ్ పంత్‌, పుజారాలు అమోఘంగా భార‌త్‌కు స్టార్ట్ ఇచ్చార‌ని, ఆ త‌ర్వాత విహారీ, అశ్విన్‌లు ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న‌ట్లు రికీ తెలిపారు. రోజంతా టీమిండియా ఆట‌గాళ్లు మ్యాచ్‌ను త‌మ స్వాధీనంలో ఉంచుకోవ‌డం అనిర్వ‌చ‌నీయ‌మ‌ని అన్నారు. ఇక బ్రిస్బేన్‌లో జ‌రిగే నాలుగ‌వ టెస్టు కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ట్లు పాంటింగ్ తెలిపారు.