అమ్మ ఒడి డబ్బులు వద్దనుకుంటే ల్యాప్ టాప్ లు : జగన్

వాస్తవం ప్రతినిధి: అమ్మ ఒడి పథకం రెండో విడ‌త ప‌థ‌కం ప్రారంభోత్స‌వం ముఖ్య‌మంత్రి వై ఎస్ జ‌గ‌న్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున రూ.6,673 కోట్లు జమ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొచ్చామని చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది నుండి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు, అమ్మ ఒడి డబ్బులు వద్దనుకుంటే లాప్ ట్యాప్ ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. ఫోర్ జి బి ర్యామ్, 500జీబి హార్డ్ డిస్క్, విండోస్ 10 ఓ ఎస్ ఫీచర్స్ తో , మూడేళ్ల వారంటీతో లాప్ టాప్ ఇస్తామని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పిస్తామన్నారు.

ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి, రాష్ట్ర అభివృద్ధిని చూసి కడుపు మంట తట్టుకోలేక అధికార పార్టీని టార్గెట్ చేస్తూ దేవాలయాలలో విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని, ఆతర్వాత దేవాలయాల సందర్శన అంటూ హంగామా సృష్టిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.

“ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టే ముందో, తర్వాతో ఆలయాలను టార్గెట్ చేస్తున్నారు. మనం చేసిన మంచి ప్రపంచానికి తెలియొద్దనే దాడులు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోరాటం చేస్తున్నాం. అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసినవాళ్లు కొత్తవేషం కడుతున్నారు. హైదరాబాదులో కూర్చుని చంద్రబాబు, ఆయన కొడుకు కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి” అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.