ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు కళ తప్పడం ఖాయం

వాస్తవం ప్రతినిధి: ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంప్రదాయంగా నిర్వహించే కోడి పందాలకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. హైకోర్టు ఆంక్షలు ఉన్నా ప్రజాప్రతినిధుల సాయంతో ఈసారి కూడా కోడి పందాల నిర్వహణకు వారు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ వైరస్ సోకుతుందన్న భయాలతో వాటి యజమానులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే ఈ పందాల కోసం ఏడాది పొడవునా కోళ్లపై లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఉంటారు. ఓసారి ఫ్లూ సోకి కోడి చనిపోతే వారికి భారీగా నష్టం తప్పదు. ఇలా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతే ఇక సంక్రాంతి సంబరాలు కళ తప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రతి ఏడాదీ కోడి పందాల్లో లక్షల్లో బెట్టింగ్‌లుంటాయి. క్రికెట్ బెట్టింగ్‌ల తరహాలోనే ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వేలల్లో పందాలు కాస్తారు. కొన్నిచోట్ల పందెం జరిగే ప్రాంతానికి వెళ్లకుండానే ఫోన్ల ద్వారానే బెట్టింగ్‌లు కట్టే ఏర్పాట్లు చేస్తారు. అలాగే కోడి పందాల దగ్గర గుండాటలు, పేకాటలు ఇతర జూదాలు కూడా యధేచ్చగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి.