ట్రంప్‌ అభిశంసనకు రంగం సిద్దం

వాస్తవం ప్రతినిధి: క్యాపిటల్‌ భవనంపై దాడితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ట్రంప్‌ అభిశంసనకు రంగం సిద్ధమౌతోందనే చెబుతున్నారు విశ్లేషకులు. మరో పక్క ట్రంప్‌ వెంటనే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల బైడెన్‌ ఎన్నికను గుర్తించేందుకు గాను ఎలక్టోరల్‌ ఓట్ల ఆమోదానికి కాంగ్రెస్‌ సమావేశమైనప్పుడు… ట్రంప్‌ అభిమానులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించి, విధ్వంసానికి పాల్పడ్డారు.అయితే, పక్కా ప్రణాళికతో నే ఈ దాడి జరిగినట్టు స్పష్టమౌతోందని అంటున్నారు. ట్రంప్‌ మద్దతుదారులు ఓ లారీ నిండా తుపాకులు, బాంబులు వెంటతెచ్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు. క్యాపిటల్‌ భవనం ముట్టడి సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మొత్తం వ్యవహారానికి ట్రంప్ బాధ్యుడని అమెరికా చట్టసభల స్పీకర్‌ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయకపోతే. అభిశంసన తప్పదని ఆమె హెచ్చరించారు.

ఇదే విషయాన్ని స్పష్టం చేసిన స్పీకర్ నాన్సీ పెలోసీ, తక్షణం ఆయన గద్దె దిగాలని స్పష్టం చేశామని, లేకుంటే రెండోసారి అభిశంసించడానికి వెనుకాడబోమని ట్రంప్ కు తెలియజేశామని అన్నారు. అధ్యక్ష పదవిలో ఉండి తిరుగుబాటును నడిపించిన ట్రంప్, ఆ పదవిలో ఉండేందుకు అర్హుడు కాదని తీర్మానం ముసాయిదాలో పేర్కొన్న సభ్యులు, రేపు సహాకమిటీ ముందుకు దీన్ని తేనున్నారని తెలుస్తోంది. ఆపై బుధ, గురువారాల్లో చర్చించి, తీర్మానం ఆమోదం పొందిన తరువాత సెనేట్ కు పంపాలన్న వ్యూహంలో డెమొక్రాట్ నేతలు ఉన్నారు.