రవితేజ ‘క్రాక్’ కు లైన్ క్లియర్..

వాస్తవం ప్రతినిధి:దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు సీనియర్ హీరో రవితేజ. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు అలరిస్తూ మాస్ మహారాజాగా పేరొందాడు. చాలా కాలం పాటు వరుస విజయాలతో సత్తా చాటిన ఈయన.. ఇటీవల పరాజయాల పరంపరతో సతమతం అవుతున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ‘క్రాక్’ అనే సినిమా చేశాడు. ఎన్నో అవాంతరాల నడుమ ఎట్టకేలకు మాస్‌ మహారాజా రవితేజ నటించిన క్రాక్‌ మూవీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లొ నిన్న ఉదయం విడుదల కావాల్సిన ఈ మూవీ నిర్మాత, డిస్టిబ్యూటర్ల మధ్య ఆర్థిక సమస్యల కారణంగా చిత్రం మార్నింగ్, మ్యాట్నీ షో విడుదల కాకపోవడంతో టికెట్లు కొన్న ప్రేక్షకులు నిరాశగా థియేటర్ల నుంచి వెనుతిరిగారు. అసలు సినిమా విడుదలనే వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయడంతో రవితేజ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓ సందర్భంతో రవితేజ నిర్మాత మధుపై సీరియస్ అయినట్లు కూడా వార్తలు హల్ చల్ చేశాయి.

ఇదిలా ఉండగా సినిమా డైరెక్టర్ గోపిచంద్‌ మలినేని తన ట్విట్టర్‌ ద్వారా మూవీ విడుదలను అధికారికంగా ప్రకటించారు. సమస్యలన్నీ తీరాయని మూవీని ఈ రోజే విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ ఫస్ట్‌ షో నుంచి సమీపంలోని థియేటర్స్‌కి వెళ్లి మూవీని చూడొచ్చని పేర్కొన్నారు. సరస్వతి ఫిలిం డివిజన్‌ పతాకంపై బి. మధు ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.