రాములోరి క్షేత్రం లో క్షణక్షణం ఉత్కంఠత.!

వాస్తవం ప్రతినిధి: రాములోరి క్షేత్రంలో క్షణక్షణం ఉత్కంఠగా మారుతోంది. పూలు పడాల్సిన చోట… రాళ్లు, చెప్పులు పడ్డాయి. రామనామ స్మరణ జరగాల్సిన చోట… రాజకీయ నినాదాలు మిన్నంటాయి. సంకీర్తనలు జరగాల్సిన ప్రాంతం… పొలిటికల్‌ స్పీచ్‌లతో దద్దరిల్లింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రామతీర్థం రణతీర్థంగా మారింది. ఈ సంఘటన వెనుక వైసిపి ఉన్నదని టిడిపి, టిడిపి ఉన్నదని వైసిపి, టిడిపి, వైసిపి ఉన్నాయని బీజేపీ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఎవరి హస్తాలు ఉన్నాయో తేల్చాల్సింది ప్రభుత్వం, పోలీసులు మాత్రమే.

శతాబ్దాల చరిత్ర ఉన్న… విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీకోదండరామాలయం వద్ద హైటెన్షన్‌ కొనసాగింది. డిసెంబరు 29వ తేదీన రామతీర్థ క్షేత్రంలో… కొండపై వెలిసిన ఆలయంలోని దుండగులు రాముడి విగ్రహం తలను విరగ్గొట్టి.. ఎత్తుకుపోయారు.

మరోవైపు విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసంపై కుట్ర కోణాలు కూడా తెరపైకి వస్తున్నాయి. డిసెంబర్ 30న ఇళ్ల పట్టాల పంపిణీ నిమిత్తం సీఎం వైఎస్ జగన్ విజయనగరంలో పర్యటించడానికి ఒకరోజు ముందు ఈ విగ్రహ ధ్వంసం ఘటన వెలుగుచూసింది. నిజానికి 28వ తేదీ రాత్రే దుండగులు రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న ప్రచారం జరుగుతోంది. 29వ తేదీ ఆలయంలో సీసీటీవీని ఏర్పాటు చేస్తారనగా ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు రాజకీయ లబ్ది కోసం టీడీపీ వేసిన ఎత్తుగడగా వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు మతాన్ని,దేవుళ్లను కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తోంది. టీడీపీ మాత్రం ఇది జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్ఠ అని మండిపడుతోంది. ఇప్పటివరకూ ఏ దేవుడి విగ్రహ ధ్వంసం కేసులోనూ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తోంది. రామతీర్థం ఘటన తర్వాత ప్రత్యర్థి పార్టీలన్నీ వైసీపీని టార్గెట్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు మున్ముందుకు ఎక్కడికి దారితీస్తాయో… ఏ టర్న్ తీసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఏదేమైనప్పటికీ ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.