అమెరికాలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి !

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి చెందారు. పూతలపట్టు మండలానికి చెందిన కటారి ప్రేమలత (32) అమెరికాలోని న్యూజెర్సీలో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందగా.. యువతి బంధువులు మాత్రం భర్తపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ భార్య ప్రేమలత ఆత్మహత్యకు పాల్పడిందంటూ అమెరికా నుంచి తండ్రి త్యాగరాజనాయుడుకు సమాచారం అందింది. మృతదేహాన్ని ఇక్కడికి పంపించాలని తండ్రి కోరుతున్నా సుధాకర్‌ నుంచి సరైన సమాధానం రావడం లేదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల నడుమ గొడవలున్నాయని, గతంలో అమెరికాలోనే భర్తపై ప్రేమలత పోలీసులకు ఫిర్యాదు చేసిందనీ వారు చెబుతున్నారు. మరోసారి భర్త నుంచి వేధింపులు ఎదురైతే ఆమెను ఇండియాలో తండ్రి వద్దకు పంపుతామని పోలీసులు చెప్పడంతో ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడని కూడా చెబుతున్నారు. ఆమె మృతికి భర్తే కారణమంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమలత మృతదేహాన్ని ఇండియాకు పంపాలని కోరుతూ స్థానికంగా పోలీసు అధికారులను ఆశ్రయిస్తామని వారు తెలిపారు.