టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ప‌ద‌వి నుంచి తప్పుకొన్నారు. గ్రేటర్ ఎన్నిక‌ల్లో ఓట‌మికి నైతిక బాధ్య‌త వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపారు.

కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 2015 నుంచి ఉత్తమ్‌ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.

మరోవైపు.. డిసెంబర్ 9వ తేదీన కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఉన్నట్టు తెలుస్తోంది.

ఈసారి బల్దియా ఎన్నికల్లో పోటీ అంతా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్యే నడిచింది. అభివృద్ధి మంత్రంతో టీఆర్ఎస్, మతపరమైన అంశాలు, భవిష్యత్ పథకాలతో బీజేపీ, స్థానిక బలం ఆధారంగా ఎంఐఎం తమ శక్తిమేర పోరాడాయి. ఈ పోరాటంలో కాంగ్రెస్ బాగా వెనుకబడిపోయింది. బీజేపీ తన అధినాయకత్వాన్ని సైతం గ్రేటర్ ప్రచార బరిలో దించి మెరుగైన ఫలితాలు అందుకుంది. కాంగ్రెస్ కు ఆ స్థాయిలో ప్రచారం చేసేవారే కరవయ్యారు.