జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరో ట్విస్ట్!

వాస్తవం ప్రతినిధి: జనసేన పార్టీలోనే ఉంటూ వైసీపీకి నిత్యం మద్దతు తెలిపే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరో ట్విస్ట్ ఇచ్చారు. తన కుమారుడు వెంకట్‌ రామ్‌ ను వైసీపీలో చేర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంకటరామ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాపాక వరప్రసాద్‌ సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగింది.

రాపాక వరప్రసాద్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి రాజోలు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఇతనే కావడం గమనార్హం. గత ఎన్నికల్లో వరప్రసాద్ గెలిచాక వైసీపీలో చేరబోతున్నారా అని మీడియా ప్రశ్నిస్తే ఆ పార్టీలో చేరి 152 నంబర్ కావాలని అనుకోవట్లేదని.. జనసేనలో నంబర్ 1 గానే కొనసాగుతానని చెప్పారు. కానీ.. కొద్ది రోజులకే జగన్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు అసెంబ్లీలోనే ప్రకటించారు.

గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనే విమర్శలు చేస్తూ.. చాలా సార్లు వైసీపీకి సపోర్టు చేసిన విషయం తెలిసిందే.