వాస్తవం ప్రతినిధి: ప్రఖ్యాత మేగజైన్ టైమ్స్‌లో భారతీయ-అమెరికా బాలికకు అరుదైన గౌరవం దక్కింది. కొలరాడోకు చెందిన 15 ఏళ్ల గీతాంజలి రావును ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా పరిచయం చేసింది. అంతేకాదు.. ఆ బాల శాస్త్రవేత్తను దిగ్గజ హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ ఇంటర్వ్యూ చేశారు.
టైమ్ మేగజీన్ కోసం ఆమెను ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఆంజెలినా జోలి వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ చేశారు. తాగునీటి కాలుష్యం, డ్రగ్స్ వాడకం, సైబర్ వేధింపులు.. తదితర సమస్యలకు గీతాంజలి రావు టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని ‘టైమ్’ ప్రశంసించింది. 5 వేల మందితో పోటీ పడి ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్ తొలి ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ గుర్తింపును ఆమె సాధించింది. కలుషితమైన నీటిని గుర్తించడం నుంచి మత్తు పదార్థాలకు బానిసవుతున్న వారిని రక్షించడం, సైబర్ బెదిరింపులు వంటి పలు అంశాలకు సాంకేతికత సాయంతో గీతాంజలి పరిష్కార మార్గాన్ని చూపారని టైమ్ ప్రతినిధులు తెలిపారు. కరోనా సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘన, సైబర్ బెదిరింపులు, పర్యావరణ మార్పులు ఇలా ప్రస్తుతం తన తరంవారు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని గీతాంజలి ఆవేదన వ్యక్తం చేశారు.