సంక్రాంతికి రెడీ అవుతున్న రవితేజ..!!

వాస్తవం సినిమా: ఇండస్ట్రీలో గత కొన్నాళ్ల నుండి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని “రాజా ది గ్రేట్” సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి విజయం సాధించిన తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఒకానొక సమయంలో మినిమమ్ మార్కెట్ తో మాత్రమే కాక ఖచ్చితంగా లాభాలు ఉండే రవితేజ మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది అనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో వినబడుతుంది. దీంతో రవితేజతో సినిమా చేయాలంటే చాలా మంది డైరెక్టర్లు మరియు నిర్మాతలు భయపడే పరిస్థితి క్రియేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో గతంలో డాన్, బలుపు వంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం “క్రాక్” అనే సినిమా రవితేజ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కావడంతో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. వాస్తవానికి మహమ్మారి కరోనా వైరస్ రాకపోయి ఉంటే ఈ వేసవి కాలంలో రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావించింది. అయితే కరోనా రాకతో సినిమా థియేటర్ లు మూతపడటంతో, పరిస్థితి అంతా మారిపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. కానీ తాజాగా ప్రభుత్వాలు సినిమా ధియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కల్పించడంతో వచ్చే సంక్రాంతికి “క్రాక్” సినిమాని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని రవితేజ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది.