కొవిడ్ వ్యాక్సిన్ పై శుభవార్త చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

వాస్తవం ప్రతినిధి: మరికొన్ని వారాల్లో భారత్ లో కరోనా టీకా అందుబాటులోకి రానున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభ, రాజ్యసభలోని విపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సిన్ ధర ఎలా ఉండాలన్న దానిపై వారితో చర్చించారు.ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. మరి కొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నదని తెలిపారు. తక్కువ ధరకే మనం వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉందన్నారాయన. వ్యాక్సిన్ తయారీలో విజయం సాధిస్తామని మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు విశ్వాసంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఈమేరకు ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో పలు విషయాలను మోడీ వెల్లడించారు. ప్రస్తుతం దాదాపు 8 వాక్సిన్లు వివిధ దశల్లో ట్రయిల్స్ లో ఉన్నాయని మోడీ తెలిపారు.

మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్‌కు వ్యాక్సిన్ పంపిణీలో విశేష సామర్థ్యం ఉందని చెప్పిన మోడీ… వ్యాక్సినేషన్ రంగంలోని నెట్‌వర్క ను పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపారు. వ్యాక్సిన్ ధర, పంపిణీ తదితర అంశాలపై అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని పార్టీల నేతలకు ఆయన సూచించారు. వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని చెప్పారు. రాష్ట్రాలతో చర్చలు జరిపి, ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్ కి సంబంధించిన ప్రతి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్‌ ప్రారంభిస్తామని చెప్పిన మోడీ.. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.