ఉద్రిక్తమవుతున్న ఉద్యమం..లక్షల సంఖ్యలో ఢిల్లీ చేరుకొంటున్న అన్నదాతలు!

వాస్తవం ప్రతినిధి: తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకూ పట్టు వేడేది లేదంటూ..లక్షల సంఖ్యలో అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లీ చేరుకొంటున్నారు. దాదాపు నెల రోజుల క్రితం పంజాబ్ లో మొదలైన అన్నదాతల ఉద్యమం ఇపుడు ఏకంగా కేంద్రాన్నే వణికించేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పంజాబులో రైతుల ఉద్యమం మొదలైన విషయం తెలిసిందే. అయితే ఆ ఉద్యమం మెల్లిగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్ధాన్ హర్యానా రాష్ట్రాలకూ పాకింది. తమ డిమాండ్లను నెరవేర్చుకునే లక్ష్యంతో లక్షల సంఖ్యలో రైతులు ఢిల్లీకి వెళ్ళేందుకు ప్రయాణం కట్టారు. ఇదే సమయంలో భారీ ఎత్తున చేరుకున్న రైతులను ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోనే పోలీసులు నిలిపేశారు. దాంతో లక్షలాది మంది రైతులు సరిహద్దుల్లోనే గడచిన తొమ్మిది రోజులుగా క్యాంపు వేసున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు తాము ఆందోళనను విరమించేది లేదంటూ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో ఏమి చేయాలో కేంద్రానికి అర్దం కావటం లేదు. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎదురైనా అతిపెద్ద ఆందోళన ఇదే అని చెప్పాలి.