అన్నయ్య రాజకీయాల్లో ఉంటే..ఇప్పుడు సీఎం స్థానంలో ఉండేవారు : పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల కుండపోత వర్షాల కారణంగా ఏపీలో నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మొదటిలో కృష్ణా గుంటూరు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలో జనసేన పార్టీ కేడర్ తో సమావేశమైన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నయ్య చిరంజీవి రాజకీయాల్లో ఉంటే ఏపీ రాజకీయ పరిస్థితులు వేరేలా ఉండేవి అంటూ స్పష్టం చేశారు. ‘అన్నయ్య చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. అధికారం మనకు బాధ్యత అలంకారం కాదు. అజమాయిషీ చేయటానికి అధికారం అని ఇప్పుడు అనుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

అదే విధంగా తాను రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవటానికి సిమెంటు ఫ్యాక్టరీ కోసమో.. ఇసుక అమ్ముకోవటానికో.. మద్యం అమ్ముకోవటానికో అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడానికి రాలేదని పవన్ పేర్కొన్నారు. ఓడిపోయినా గాని అతి తక్కువ సమయంలో నిలబడిన పార్టీ జనసేన పార్టీ అని పవన్ చెప్పుకొచ్చారు. రైతుల ఓట్లు మరియు దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ వాళ్ళ పైనే దాడులకు పాల్పడుతున్న ట్లు ఈ సభలో పవన్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ఈ సభకు భారీ స్థాయిలో జనసేన పార్టీ క్యాడర్ రావడం జరిగింది.