పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లకు బండ్ల గణేష్ ఫైర్..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి అభిమానులు మాత్రమే కాక భక్తులు కూడా ఉంటారని చాలామంది చెబుతుంటారు. హిట్టు ఫ్లాపు తో సంబంధం లేకుండా పవన్ క్రేజ్ ఉంటుందని అంటుంటారు. అలాంటి వీర భక్తులలో ఒకరు బండ్లగణేష్. ఇండస్ట్రీలో కమెడియన్ గా అదేవిధంగా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ నిర్మాతగా రాణిస్తున్న బండ్లగణేష్ పవన్ కళ్యాణ్ కి వీర భక్తుడు. చాలా బహిరంగ వేదికలలో పవన్ కళ్యాణ్ నా దేవుడు అని బండ్ల గణేష్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ని ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఊసరవెల్లి అని విమర్శించడం పట్ల బండ్ల గణేష్ ట్విట్టర్ లో భారీ స్థాయిలో సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అలాంటి వ్యక్తిని అనటం చాలా దారుణమని ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను అని తెలిపారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉండటానికి కారణం జిహెచ్ఎంసి ఎన్నికలు అని చెప్పుకొచ్చారు. నిస్వార్ధంగా పనిచేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ ని.. ఆ దేవుణ్ణి అంటే ఊరుకునే ప్రసక్తి లేదని బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ కి గట్టి కౌంటర్లు వేశారు.