ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను హెచ్చరిక..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నివర్ తుఫాన్ దెబ్బకు భారీ స్థాయిలో పంట నష్టం చూసిన సంగతి తెలిసిందే. కుండపోత వర్షాల కారణంగా చాలా మంది రైతులు నష్టపోయారు. తుఫాను దెబ్బకు నష్టపోయిన రైతుల విషయంలో ప్రభుత్వం సరైన న్యాయం చేయడం లేదని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ లో ప్రతిపక్ష పార్టీ టిడిపి నేతలు పెద్ద పెద్ద డైలాగులు కూడా వేస్తూ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు.

ఇదిలా ఉంటే “నివర్ తుఫాన్” చేసిన నష్టం మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను రాబోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. “బురేవి” గా పిలిచే ఈ తుఫాన్ శ్రీలంకలో తీరం దాటుతునప్పటికీ ఆ ప్రభావం ఏపీపై అదేవిధంగా తమిళనాడు పై ఉండనుందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఈ తుఫాను వల్ల రానున్న 24 గంటల్లో రాయలసీమ అదేవిధంగా దక్షిణ రాష్ట్రాలలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈక్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆదేశాలు కూడా ఇచ్చింది.