టీడీపీ హయాంలోనే విద్యుత్ రంగం నష్టాల్లో ఉంది అంటున్న ఏపీ ఆర్థిక మంత్రి..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీ టిడిపి మధ్య మాటల తూటాలు భారీగా పేలుతున్నాయి. కుండపోత వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది రైతుల నష్టపోవడంతో టిడిపి.. ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో కడిగి పారేస్తుంది. అదేవిధంగా పేదలకు ఇళ్ల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదిలా ఉండగా విద్యుత్ రంగం విషయంలో టీడీపీ సభ్యులు అసెంబ్లీలో చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ హయాంలో సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో విద్యుత్‌ రంగాన్ని నష్టాల్లోకి నెట్టారని, రెండు రూపాయలకు విద్యుత్‌ దొరికే అవకాశం ఉన్నా.. రూ.4.80 పైసలకు కొనుగోలు చేశారని ఆర్దిక మంత్రి ఆరోపించారు. గతంలో 4 వేల మెగావాట్లకు బాబు యూనిట్‌కు సుమారు రూ.7 వరకు అగ్రిమెంట్‌ చేసుకున్నారని తెలిపారు. 4 వేల మెగావాట్లకు తాము యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు అగ్రిమెంట్ చేసుకున్నామని వెల్లడించారు. సౌర విద్యుత్‌ను తానే కనిపెట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు సంబంధించి ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని కోరారు. ఆర్థిక మంత్రి చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని మరోపక్క ఏపీ టీడీపీ అధ్యక్షుడు కౌంటర్లు వేశారు.