అన్నదాతలపై ఏమిటీ దౌర్జన్యం?: రాహుల్ గాంధీ

వాస్తవం ప్రతినిధి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అన్నదాతకు ప్రతి ఒక్కరు రుణ పడి ఉండాలని, అది పోయి వారిని లాఠీలతో కొట్టించడం, వాటర్ క్యానన్లు ఉపయోగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తన అహాన్ని విడిచిపెట్టి రైతులకు వారి హక్కులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు న్యాయం కోసం రోడ్డెక్కారని, వారి కష్టానికి మనమంతా రుణపడి ఉన్నామని రాహుల్ ట్వీట్ చేశారు. లాఠీలు, బాష్పవాయువును ప్రయోగించి అవమానించడం ద్వారా వారి రుణాన్ని మనం తీర్చుకోగలమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి అహంకార పీఠాన్ని దిగొచ్చి వారి హక్కులను కాపాడాలని రాహుల్ డిమాండ్ చేశారు.