తాపీ పనిముట్లతో మాజీ సీఎం నిరసన

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో ఇసుక కొరతతోపాటు నూతన ఇసుక విధానాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఇవాళ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీ చేపట్టారు .

‘వైకాపా ఇసుకాసురులు ప్రజల్ని దోచుకుంటున్నారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయిలు, 5 యూనిట్ల లారీ ఇసుక గరిష్ఠంగా 5 వేల రూపాయలు ఉంటే వైఎస్ జగన్ పాలనలో ట్రాక్టర్ ఇసుక 6 వేల రూపాయలు, లారీ ఇసుక 30 వేల రూపాయలు చేసి ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు’ అని లోకేశ్ విమర్శించారు.

‘భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే. ఇసుక అక్రమ రవాణా ఆపాలి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అంటూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిమాండ్ చేస్తూ నిరసన తెలిపాం’ అని లోకేశ్ పేర్కొన్నారు.

తాము నిరసన తెలుపుతుండగా తీసుకున్న ఫొటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  తాపీ పనిముట్లను పట్టుకుని చంద్రబాబు, బంగారం కొలిచే త్రాసుతో లోకేష్ తమ నిరసన తెలియజేశారు. వీటిని పట్టుకుని అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. ఇసుక ధరల పెంపుతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో ఉచితంగా దోరికిన ఇసుక ఇప్పుడు భారంగా మారిందని టీడీపీ ప్రజాప్రతినిధులు అన్నారు.