ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

వాస్తవం ప్రతినిధి: డ్రైవింగ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు, స్వచ్చంద సేవ సంస్థలు నిత్యం హెచ్చరికలు చేస్తున్నా తీరు మారడం లేదు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్‌ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై ఇన్నోవా కారు, బోర్‌వెల్‌ వాహనం ఢీకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హైదరాబాద్ తాడ్‌బండ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో 10 మంది ఉన్నట్లు తెలిపారు. తాడ్‌బండ్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తున్న సమయంలో ఆ ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.