చంద్రబాబు సారీ చెప్పాలి : ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.

వాస్తవం ప్రతినిధి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొలిరోజు చంద్రబాబు వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. రైతుల సమస్యల గురించి చంద్రబాబు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో దళారీ వ్యవస్థను అడ్డంపెట్టుకుని రైతులను నిండా ముంచారని, అంతేకాకుండా తన హెరిటేజ్ కంపెనీకి లాభాల కోసం రైతుల దగ్గర తక్కువ ధరకు కొని తన కంపెనీలో ఎక్కువ ధరకు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుది అంటూ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

రైతుల సమస్యల గురించి అసెంబ్లీ లో సోమవారం పోడియం వద్ద కింద కూర్చుని చంద్రబాబు నిరసన తెలియజేయడం దురదృష్టకరమని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

విపక్షనేత పోడియంలో కూర్చుని అభ్యంతరకరంగా భైటాయిస్తే, ఇక కింది వాళ్ళు బరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు విని విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సంస్కారాన్ని మరిచి ముఖ్యమంత్రిని వాడూ వీడు అని వ్యాఖ్యానించడం దారుణమని, చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.