ఆ విషయంలో చైనా ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల్సిందే : ఆస్ట్రేలియా ప్రధాని

వాస్తవం ప్రతినిధి: చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిజియాన్‌ ట్విట్టర్‌లో ఒక ఫొటోను పోస్టు చేశారు. ఆ గ్రాఫిక్‌ ఫొటోలో గొర్రెపిల్లను పట్టుకున్న ఓ ఆఫ్ఘాన్‌ బాలుడి గొంతులో ఆస్ట్రేలియా సైనికుడు నెత్తురోడుతున్న కత్తిని దింపుతున్నట్లుంది. దీంతో ఆస్ట్రేలియా.. చైనా పై ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

అయితే, ఈ ఫొటో అబద్ధమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్ మండిపడ్డారు. చైనా అబద్ధాలను ప్రచారం చేస్తోందని మోరిసన్‌ భగ్గుమన్నారు. చైనా ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ డిమాండ్‌ చేశారు. ఆస్ట్రేలియా రక్షణ దళాలను దెబ్బతీసేందుకు ఉద్దేశించిన ఆ ట్వీట్‌ను తొలగించాలని కోరారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లపై పోరాడిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలో ఆస్ట్రేలియా దళాలు కూడా పాలుపంచుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో (2009-2013 మధ్య) 39 మంది అమాయకులను అన్యాయంగా చంపేయడంలో ఆస్ట్రేలియా ప్రత్యేక దళాల పాత్ర ఉందని ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో లిజియాన్‌ ట్విట్టర్‌లో ఆ ఫొటోను పోస్టు చేసి.. ‘ఆఫ్ఘాన్‌ పౌరులు, ఖైదీలను ఆస్ట్రేలియా సైనికులు హత్య చేయడం షాక్‌కు గురిచేసింది. ఇటువంటి చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సైనికులను విడిచిపెట్టకూడదు’ అని ఫొటోతో పాటు రాశారు. అసలే.. ఆస్ట్రేలియా-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో తాజా వివాదం అగ్నికి ఆజ్యం పోసింది.