టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు భారీ షాక్‌..!!

వాస్తవం ప్రతినిధి: ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ సంస్థకు ఎంతో క్రేజ్ ఉంది. ఆ సంస్థ తయారు చేసిన ఫోన్లు కానీ, ఇతర ఏ వస్తువులైనా సరే జనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొత్త ప్రాడక్ట్ మార్కెట్లోకి రాబోతోందనే న్యూస్ వచ్చిందంటే చాలు కొంత మంది వినియోగదారులు వాటి కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి దిగ్గజ సంస్థ యాపిల్ కు కూడా జరిమానా విధించారు. ఆ సంస్థ తప్పుడు విధానాలను అనుసరించిందంటూ ఇటలీలోని యాంటీ ట్రస్ట్ అథారిటీ 10 మిలియన్ యూరోస్ జరిమానా విధించింది.

ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ ఆపిల్ కంపెనీపై భారీ జరిమానాను విధించింది. వినియోగదారులను నమ్మించేందుకు ఆ సంస్థ తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ 10 మిలియన్ యూరోస్ ( 12 మిలియన్ డాలర్లు, కోటి 20 లక్షల డాలర్లు) జరిమానా విధించింది.

ఇటలీ యాంటీట్రస్ట్‌ అథారిటీ ప్రకటన ప్రకారం ఆపిల్‌ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్ల ఐఫోన్లపై ఎలాంటి వివరాలు ఇవ్వకుండా.ఈ లక్షణం కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఉందని స్పష్టం చేయకుండా వాటర్‌ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని పేర్కొంది. కంపెనీ డిస్‌క్లైమర్‌లో మాత్రం ద్రవ పదార్థాల నుంచి ఫోన్‌ దెబ్బ తింటే వారంటీ వర్తించదని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు నీటిలోపడి ఫోన్లు దెబ్బతిన్న వారికి సంస్థ ఎటువంటి సహకారం అందించలేదని కూడా ఆరోపించింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌ఎస్ మాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో , ఐఫోన్ 11 ప్రో మాక్స్ మోడళ్లకు సంబంధించిన ప్రచారాన్ని ఇది ఊదహరించింది. ఇది వినియోగదారులను తప్పుడు ప్రకటనతో మోసం చేయడమేనని యాంటీట్రస్ట్ అథారిటీ వాదించింది.