మరోసారి లాక్ డౌన్ నిర్ణయంపై ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం

వాస్తవం ప్రతినిధి: భారత్ లో సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,31,691 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,37,139 కి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్స్ తో ప్రధాని మోదీ డిసెంబర్ 4, శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముంది.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి ఈ సమావేశాన్ని సమన్వయం చేయనున్నారు. ఐదుగురు ఎంపీలు వున్న పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో ప్రధాని భేటీ కావడం ఇది రెండోసారి కానుంది.

ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్,‌ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సహా పలువురు‌ కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.