టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

వాస్తవం ప్రతినిధి: టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం నోముల నర్సింహయ్య తీవ్ర అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు సీపీఎం తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సీపీఎం శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ క్రియాశీలక నేతగా గుర్తింపు పొందారు. వామపక్ష పోరాట ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన సీపీఎంకు గుడ్‌బై చెప్పారు. 2014లో గులాబీ కండువాను కప్పుకొన్నారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఘన విజయాన్ని అందుకున్నారు.