వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా జట్టుకు మూడోవన్డే ముంగిట ఎదురుదెబ్బ తగిలింది. రెండోవన్డేలో వార్నర్‌కు అయిన గాయం తీవ్రంగా మారింది. శిఖర్ ధావన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో వార్నర్ గాయపడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే వార్నర్ మైదానాన్ని వీడాడు. వార్నర్ తొడకండరానికి గాయమైందని ఫిజియో వెల్లడించాడు. స్కానింగ్ చేసిన తరువాత వార్నర్ తొడకండరం గాయం తీవ్రమైనట్లు తేలిందని వివరించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వార్నర్ 83పరుగులతో రాణించాడు. దీంతో వరుసగా రెండు హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్న వార్నర్ పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. వైద్యపరీక్షల్లో వార్నర్ గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలింది. మూడోవన్డేతోపాటు మూడు టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉండడని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. వార్నర్ స్థానాన్ని జాన్ మాథ్యూ షార్ట్ భర్తీ చేస్తాడని లాంగర్ తెలిపాడు. ఆసీస్ జట్టు వన్డే సిరీస్ గెలవడంతో ప్రధాన పేసర్ కమిన్స్‌కు విశ్రాంతి ఇవ్వనున్నామని పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే బుధవారం జరగనుంది.