‘తానా’ చేయూత కార్యక్రమం .. ప్రతిభ కలిగిన విద్యార్థులకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌..!!

వాస్తవం ప్రతినిధి: తానా లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం ఏర్పాటైంది. ఇప్పటికే పలు సేవాకార్యక్రమాలు చేసిన తానా తాజాగా ఇటీవల ప్రవేశపెట్టిన ‘తానా’ చేయూత కార్యక్రమం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులను ఆదుకునేందుకు తానా’ జాయింట్‌ ట్రెజరర్‌ వెంకట్‌ కోగంటి ముందుకు వచ్చారు. దాదాపు 8 మంది విద్యార్థులకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌ అందించారు. ఖమ్మంలోని ‘డిస్ట్రిక్ట్‌ ఎన్నారై ఫౌండేషన్‌’ ద్వారా ఈ స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘తానా’ ఫౌండేషన్‌ చైర్మన్ నిరంజన్‌ శృంగవరపు, ‘తానా’ ఫౌండేషన్‌ ట్రెజరర్‌ శశికాంత్‌ వల్లేపల్లి మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన విద్యార్థులు ఆర్థిక లేమితో చదువుకు స్వస్తి పలకరాదన్న ఉద్దేశంతో ‘తానా’ ఫౌండేషన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.