అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి..!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని టెక్సాస్ సిటీకి దగ్గర్లో జరిగిన యాక్సిడెంట్​లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. టెక్స స్‌ రాష్ట్రంలోని టెక్సస్‌ నగరంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.

నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డి (57), లక్ష్మి (50) దంపతులకు కూతురు మౌనిక, కొడుకు భరత్‌‌ ఉన్నారు. హైదరాబాద్​-1 డిపోలో కండక్టర్​గా నర్సింహారెడ్డి పని చేస్తున్నారు. పిల్లలిద్దరూ అమెరికాలోని టెక్సాస్​లో ఉంటున్నారు. అక్కడే చదువుకుని, సాఫ్ట్​వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తాము సంపాదించిన డబ్బుతో టెక్సాస్​లో ఓ ఇల్లు కొన్నారు. తల్లిదండ్రులను తీసుకెళ్లి గృహ ప్రవేశం చేశారు. శనివారం (అక్కడి టైం ప్రకారం) కుమార్తె మౌనిక వివాహ సంబంధం కోసం కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులతో పాటు కుమారుడు భరత్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మౌనిక, మరొకరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం పెద్ద చింతకుంట గ్రామంలో తెలియడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.