తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ : శివాలయాలకు పోటెత్తిన భక్తులు

వాస్తవం ప్రతినిధి: హరిహర స్వరూపమైన కార్తీక మాసం కైవల్యప్రదమైంది. జన్మ జన్మల పాపాల్ని పటాపంచలు చేసి మానవాళికి మోక్షాన్ని ప్రసాదించే ఈ మాసంలో మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి.

ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని శివాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. పెద్దఎత్తున కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పలు ఆలయాల్లో అభిషేకాలు రద్దు చేశారు ఆలయ అధికారులు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరి తీరంలో భక్తుల రద్దీ నెలకొంది. భద్రాచలంలోని గోదావరి నది దగ్గర భక్తుల రద్దీ పెరిగింది. గోదావరిలో కార్తీక దీపాలు వదులుతున్నారు.

పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం, భీమవరం సోమేశ్వరాలయం, పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయం, ద్వారకాతిరుమల మల్లికార్జున స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పట్టిసీమ, కొవ్వూరు, నరసాపురంలో గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.