సీఎం గారు సచివాలయానికి వెళ్తే కదా తెలిసేది? హైదరాబాద్‌కు రూ.500కోట్ల నిధులిచ్చామని: అమిత్ షా

వాస్తవం ప్రతినిధి: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం అనేక నిధులు ఇస్తోందని.. గ్రేటర్ పీఠం దక్కితే నాలాలు, చెరువులపై ఉన్న అక్రమ కట్టడాలు తొలగిస్తామని అన్నారు. ఈ రోజు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ అమలు చేయలేదని, మురికివాడల్లోని పరిస్థితి ఏమాత్రం మారలేదని అన్నారు. తమకు అవకాశం ఇస్తే నగర ప్రజలకు సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో లక్షా 30 వేల ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులిచ్చిందని ఆయన చెప్పారు తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ప్రధాని మోడీకి పేరొస్తుందనే తెలంగాణలో స్వాస్త్‌ యోజన పథకాన్ని తెరాస ప్రభుత్వం అమలుచేయడం లేదని ఆరోపించిన షా.. ఆయుష్మాన్‌ భారత్‌ ఫలాలు హైదరాబాద్‌ పేదలకు అందకుండా చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్తే కేంద్రం ఇచ్చిన నిధుల గురించి తెలిసేదని అన్నారు. వరదలు వచ్చినపుడు హైదరాబాద్‌కు రెండు విడతల్లో సుమారు రూ.500కోట్ల నిధులిచ్చామని చెప్పారు. రాజకీయాల్లో పొత్తులు సహజమనన్న అమిత్ షా… ఎంఐఎంతో టీఆర్ఎస్ రహస్య ఒప్పందం ఎందుకని.. బహిరంగంగానే పొత్తు పెట్టుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు.