#NRIsFORAMARAVATI : రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అండగా ప్రవాసాంధ్రులు..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు అమరావతి లేదా మూడు రాజధానులు చుట్టూ తిరుగుతున్నాయి. తెలుగుదేశం మరియు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు ధర్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో అమరావతి రగడ రోజు రోజుకు ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి చెప్పిన తరువాత నుంచే ఈ విషయంలో రగడ జరగడం మొదలైంది. అమరావతి రైతులు, ప్రజలు రోడ్డుపైకి వచ్చి రాజధానిని అక్కడి నుంచి మార్చవద్దని చెప్పి ఆందోళన చేస్తున్నారు. అమరావతి రైతులు ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న నిరసనలు తారాస్ధాయికి చేరుకున్నాయి. మొదట భూములు ఇచ్చిన రైతులతో మొదలైన ఈ ఉద్యమం మెల్లగా పరిసర జిల్లాలకు , తర్వాత రాష్ట్రాలకు, ఆ తరువాత దేశాలకు మొత్తం విస్తరించింది. ఒక రాష్ట్రంలోనే కాదు ప్రముఖ ఎన్నారైలు జన్మభూమి కోసం తమ పనులు మానుకుని వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారు.

కాగా.. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అణిచివేయాలని చూస్తున్న నేపథ్యంలో పలువురు ప్రవాసాంధ్రులు రైతులకు అండగా నిలుస్తున్నారు. ‘ఒక రాష్ట్రం-ఒక రాజధాని’ నినాదంతో ఉద్యమిస్తున్న రైతులకు తమ వంతు ఆర్థిక సాయం అందజేసేందుకు #NRIsFORAMARAVATI అనే సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ సంస్థకు అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగర ప్రవాసాంధ్రులు రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. షార్లెట్ నగర ప్రవాసులు టాగోర్ మల్లినేని, నాగ పంచుమర్తి, నితిన్ కిలారు, శ్రీనివాస్ పాలడుగు, బాలాజి తాతినేని, శ్రీనివాస్ చందు గొర్రెపాటి ఆధ్వర్యంలో షార్లెట్ సిటీకి చెందిన 130 మంది ప్రవాసాంధ్రులు రేండు రోజుల వ్యవధిలో రూ.25లక్షలు($31,454) సేకరించి #NRIsFORAMARAVATI సంస్థకు అందజేశారు.