దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలకు కేసీఆర్ ఆహ్వానం!

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోడీపై సమరానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్‌ లో జాతీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 10 మంది పార్టీ అధ్యక్షులు, ముఖ్య మంత్రులతో చర్చించిన కేసీఆర్.. ఈసారి పూర్తిస్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో ఆయన వెల్లడించారు.

డిసెంబర్ లో జరిగే సమావేశానికి దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తామని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ నేత కుమారస్వామి, ఎన్సీపీ నేత శరద్ పవార్ లతో ఇప్పటికే చర్చించామని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను కేంద్రం ఉపసంహరిస్తోందని అసహనం వ్యక్తం చేసిన ఆయన.. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తామన్న స్పష్టం చేశారు. అన్ని కంపెనీలు ప్రైవేటు పరం చేసే కార్మికులు రోడ్డున పడతారని అన్నారు.