భాగ్యనగరంలో బాద్ షా!

వాస్తవం ప్రతినిధి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించిన అమిత్‌షా.. హైదరాబాద్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. కేసీఆర్‌, ఎంఐఎం పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రధాని మోదీపై హైదరాబాద్‌ ప్రజలు అభిమానం చూపుతున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠం ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అమిత్‌షా. బీజేపీ జోరుతో కేసీఆర్‌, ఓవైసీ నారాజ్‌ అయిపోయారని ఎద్దేవా చేశారు. వరదల పాపం టీఆర్ఎస్‌ ప్రభుత్వానిదే అని విమర్శించిన అమిత్‌ షా.. చెరువుల ఆక్రమణ వల్లే వరదలు వచ్చాయని ఆరోపించారు.

రోడ్‌షో జరిగే పరిసర ప్రాంతాలు మొత్తం కాషాయమయంగా మారిపోయాయి. భారత్‌ మాతాకీ జై.. జై శ్రీరాం అంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. గ్రేటర్‌ ఎన్నికల్లో అగ్రనేతలంతా ఒక్కొక్కరుగా తరలివచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మేయర్‌ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.

దాదాపు రెండు గంటలపాటు ప్రచారం నిర్వహించిన షా.. ఎలాంటి ప్రసంగం చేయకుండానే రోడ్‌షో ముగించారు. ఈ రోడ్ షో అయిపోయాక.. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఆఫీసులో ఉండి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

హోంమంత్రి పర్యటన నేపథ్యంలో చార్మినార్ పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి.

అమిత్ షాకు స్వాగతం పలికేందుకు కాషాయ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సైతం అమిత్ షా వెంట ఉండి ర్యాలీలో పాల్గొన్నారు..