ఎన్నోచర్చల అనంతరం పార్లమెంటు ఈ వ్యవసాయ సంస్కరణలకు చట్టరూపం కల్పించింది: మోడీ

వాస్తవం ప్రతినిధి: ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ రంగ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నెలవారీ రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్‌లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ వ్యవసాయ సంస్కరణలు మన రైతులకు నూతన కవాటాలను తెరిచాయని, వారి జీవన వికాసానికి తోడ్పడుతున్నాయని ఆయన చెప్పారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని, దళారుల నుంచి తమను కాపాడాలని ఎన్నో ఏళ్లుగా అన్నదాతలు కోరుతున్నారని, వారి కష్టాలను తొలగిస్తామని తాము హామీ ఇచ్చామని, అలాగే ఈ చట్టాలను అమలులోకి తెచ్చామని మోడీ పేర్కొన్నారు.

ఎన్నోచర్చల అనంతరం పార్లమెంటు ఈ సంస్కరణలకు చట్టరూపం కల్పించింది..ఇవి రైతులకు కొత్త హక్కులు, అవకాశాలను కల్పించాయి అని ఆయన వ్యాఖ్యానించారు. వీటిని తెచ్చిన కొద్ది కాలానికే ఇవి మంచి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయన్నారు.

ఇందుకు ఉదాహరణగా మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో తన పంటకు నాలుగు నెలలుగా సొమ్ము రాక ఇబ్బందులు పడుతున్న ఓ రైతుకు మూడు రోజుల్లోనే అది లభించిందని, అలా కాకపోయి ఉంటే ఆ రైతు ఫిర్యాదు చేసి ఉండేవాడని ఆయన పేర్కొన్నారు.