వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పడి వేగంగా అడుగులు పడుతున్నా.. తన ఓటమిని మాత్రం డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడంలేదు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందంటూ పాత పాటనే వినిపిస్తున్నారు. అలాగే ఓ ప్రత్యేకవర్గం మీడియా తనను టార్గెట్ చేస్తూ బైడెన్‌కు మద్దతుగా వ్యహరిస్తుందని, ట్విటర్ కూడా అసలు ట్రెండింగ్‌లో లేని దానిని ట్రెండ్ చేస్తూ, అసలు విషయాన్ని పట్టించుకోకుండా తనపై పక్షపాతం చూపిస్తుందని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఎలక్టోరల్ కాలేజీలో తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటే గానీ తాను వైట్‌హౌస్‌ను వీడేదిలేదని ట్రంప్ తేగేసి చెప్పడం గమనార్హం.
“ఎన్నికల ఫలితాలపై నాకు ఇంకా నమ్మకముంది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగింది. 2020 యూఎస్ ఎన్నికలు చాలా క్లిష్టమైనవి. ఈ ఎన్నికల్లో నేనే విజయం సాధించాను. దేశంలో ఓ వర్గం మీడియా నాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. ట్విటర్ కూడా నాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ట్రెండింగ్‌లో లేని విషయాన్ని కూడా ఉన్నట్లు చూపుతోంది. అసలు ట్రెండైయ్యే అంశాన్ని మాత్రం పట్టించుకోదు. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న విషయం అందరికీ తెలుసు. బైడెన్ తదుపరి అధ్యక్షుడని ఎలక్టోరల్ కాలేజి ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ ఖాళీ చేస్తా’అంటూ ట్వీట్ చేశారు.