టిఆర్ఎస్ ప్రభుత్వం పై సీరియస్ అయిన తెలంగాణ హైకోర్టు..!!

వాస్తవం ప్రతినిధి: టిఆర్ఎస్ ప్రభుత్వం పై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. విషయంలోకి వెళితే కరోనా పరీక్షలు ఎక్కువ జరపాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం అదే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రోజుకి 50 వేల కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడంపై తాజాగా తెలంగాణ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ క్రమంలో ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే తమ ఆదేశాలను అమలు చేయలేదని, డాక్టర్‌ శ్రీనివాసరావుపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలపై అభ్యంతరముంటే అప్పీల్‌ చేసుకోవచ్చని, అంతేగానీ లెక్కలేనట్టు వ్యవహరిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించింది. ఈ మేరకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది.