వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ కు చైనా అధినేత జీ జిన్ పింగ్ కంగ్రాట్స్ చెప్పారు. నిజానికి రెండు వారాల క్రితమే ఆయన శుభాకాంక్షలు చెప్పాల్సింది. కానీ ఎందుకో ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించినట్టు కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఓ సందేశాన్ని పంపిచారు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. ఇక నుంచైనా రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించి, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిద్దామని ఆ సందేశంలో జిన్‌పింగ్ అన్నారు. అమెరికా, చైనా మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు రెండు దేశాల ప్రజల ప్రయోజనాలకే కాదు.. అంతర్జాతీయ సమాజానికి కూడా మేలు చేస్తుందని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఇక చైనా వైస్ ప్రెసిడెంట్ వాంగ్ కిషాంగ్ కూడా తమ నేత బాటలో నడిచారు. జో బైడెన్ కి కంగ్రాట్స్ చెబుతూ.. చైనా, అమెరికా వివిధ రంగాల్లో మరింత సహకరించుకోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.