‘నా హీరో ఇక లేడు’ .. సౌరవ్ గంగూలీ భావోద్వేగ ట్వీట్ !

వాస్తవం ప్రతినిధి: ఇటీవలే తన పుట్టినరోజు జరుపుకున్న ఫుట్ బాల్ లెజండ్ డీగో మారడోనా ఇక లేరని తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ‘నా హీరో ఇక లేడు. ఆ అద్భుతమైన ఆటగాడి ఆత్మకు శాంతి కలగాలి. నీ కోసం మాత్రమే నేను ఫుట్ బాల్ చూశా‘ అని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్విట్టర్లో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

ఫుట్ బాల్ లెజండ్ డీగో మారడోనా హఠాన్మరణం తో ‘ఫుట్ బాల్ ప్రపంచం ఓ గొప్ప ఆటగాడిని కోల్పోయింది. డిగో మారడోనా ఆత్మకు శాంతి కలగాలి. మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం’ అంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు.

1986లో అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర మారడోనాదే. ఇంగ్లాండ్ తో కీలక మ్యాచ్ లో హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ తో మారడోనా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గోల్ పోస్ట్ వద్ద మెరుపువేగంతో దూసుకెళ్లి, బంతిని గోల్ పోస్ట్ లోకి పంపినా, అది చేయి తగిలి గోల్ లోకి వచ్చిందని ప్రత్యర్థులు ఆరోపించగా, అది దేవుడి చేయి అయ్యుంటుందంటూ నాడు మారడోనా అందరినీ విస్మయానికి గురిచేశాడు.