ఫుట్‌బాల్ లెజెండ్ డీగో మారడోనా హఠాన్మరణం..శోకసంద్రంలో క్రీడాలోకం   

వాస్తవం ప్రతినిధి: ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగో మారడోనా (60 ) బుధవారం గుండె పోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. అర్జెంటీనాలోని టిగ్రే పట్టణంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నవంబరు మొదటి వారంలో మారడోనాకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స జరిగింది.
గతంలో జరిగిన ప్రమాదం వలన మారడోనాకు ఈ సమస్య వచ్చిందని న్యూరాలజిస్ట్ లీయోపోల్డో లాఖ్ గతంలోనే తెలిపారు. అయితే సర్జరీ తరువాత వారం రోజుల క్రితమే బ్యూనస్ ఏర్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హోమ్‌లో ఉంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ అంతలోనే గుండె పోటు రావడంతో హఠాన్మరణం చెందారు మారడోనా.
   ఫుట్‌బాల్‌ లెజెండ్ డిగో మారడోనా మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. మన దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఫుట్‌బాల్‌కు ఎనలేని ఆదరణ ఉంది. అదే ప్రాంతానికి చెందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా మారడోనాకు పెద్ద ఫ్యాన్.