సర్జికల్ స్ట్రైక్స్ అంటే వారికి ఎందుకంత భయం..?: విజయశాంతి

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన ‘సర్జికల్ స్ట్రైక్స్‘ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఇప్పటికే ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేత విజయశాంతి మాత్రం బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టగా మాట్లాడారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. నేడోరేపో ఆమె బీజేపీలో చేరబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుండగా ఇప్పుడీ వాఖ్యలు ఆ ప్రచారానికి బలాన్ని చేకూర్చుతున్నాయి.

సర్జికల్ స్ట్రైక్స్ అంటే టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎందుకింత ఆగమాగం అవుతున్నాయని ప్రశ్నించారు విజయశాంతి. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్థానీయులు లేరని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి కేసీఆర్ అధికారపూర్వక నివేదిక ఇవ్వచ్చు కదా? అని అభిప్రాయపడ్డారు. ఇలా చేయడని పక్షంలో ఎవరినైనా దాచిపెట్టడం వల్లే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముందని ఆమె అభిప్రాయపడ్డారు