రాజకీయ పార్టీలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వార్నింగ్..!!

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రచారంలో చేస్తున్న కామెంట్ల వల్ల మత ఘర్షణలు చోటు చేసుకొనే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా గొడవలు పెట్టి కొన్ని పార్టీలు లబ్ధి పొందడానికి అల్లరి మూకలను నగరంలోకి దింపినట్లు కూడా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఈ విషయం పై సీఎం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి మరీ.. ఇలాంటి విషయాల్లో ఊరుకునే ప్రసక్తి లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మరోపక్క హైదరాబాద్ లో ఎలాంటి ఘర్షణలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. అసత్య ప్రచారాల కారణంగా హైదరాబాద్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్‌ కేసులు పెడతామని సీపీ తెలిపారు. ‘‘ ఎలక్షన్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ హైదరాబాద్ నగరం, ప్రజలు శాశ్వతంగా ఉంటారు. ఎన్నికల ప్రచారానికి చాలా మంది వస్తున్నారు. నగరంలో ఏదో జరుగబోతోంది అన్న ప్రచారం చేస్తున్నారు. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం’’ అని అంజనీ కుమార్ స్పష్టం చేశారు.